నిధుల విడుదలకు సహకరించండి
అలంపూర్: చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నేతన్నలకు నిధుల విడుదలకు సహకరించాలని రాజోలి చేనేత కార్మికులు బీఆర్‌ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి రాజోలి చేనేత కార్మికులు ఆయనను కలిసినట్లు తెలిపారు. ఈమేరకు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేయాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదని వినతిలో తెలిపారు. రుణ మాఫీ, సబ్సిడీ రుణాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడి చేనేత రంగానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడానికి కృషి చేయాలని వినతిలో కోరారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
గద్వాలటౌన్: ఆటల్లో గెలుపు కన్నా క్రీడా స్ఫూర్తి గొప్పది.. దానికి లోబడే క్రీడాకారులు వ్యవహరించాలని, క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కృష్ణయ్య అన్నారు. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాస్థాయి బాల, బాలికల అండర్–17 బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలు గురువారం ఉత్సాహంగా సాగాయి. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వీరాపురం దగ్గర ఉన్న ఎస్‌ఆర్ విద్యానికేతన్ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ రాముడు, పీఈటీలు హైమావతి, సతీష్, నగేష్, మోహనమురళీ, నర్సింహారాజు, మల్లేశ్వరి పాల్గొన్నారు.
ప్రతి రైతు మద్దతు ధర పొందాలి
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. గురువారం మండలంలోని కొండేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధరను అందిస్తుందన్నారు. దీనికోసం రైతులు 17 శాతం తేమ ఉండేలా వడ్లను ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తరలిస్తే సరిపోతుందన్నారు. గోనె సంచులు, హమాలీ చార్జీలను కూడా కేంద్రమే భరిస్తుందన్నారు. వడ్లను కేంద్రం కొనుగోలు చేసి రైతులకు డబ్బు జమ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫ్లెక్సీల్లో వారి నాయకుల ఫొటోలు పెట్టుకోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రధానిమోదీ ఫొటో ఉండేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


