స్థానిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
గద్వాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ బీఎం సంతోష్ వివరించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్‌తోపాటు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా, అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రల అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి వివాదాలు, అవకతవకలకు అవకాశం లేకుండా, మూడు విడతలలో నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, 2011 ఎన్నికల జాబితా ప్రకారం ఎస్సీ, ఎస్టీలు, 2024 సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. అనంతరం జిల్లాలో ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలపై కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, అడిషినల్ ఎస్పీ శంకర్, డీపీఓ నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.


