సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
ఎర్రవల్లి: విద్యార్థుల సమగ్రాబివృద్ధికి ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషిచేయాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ అమీర్‌పాష ఆధ్వర్యంలో స్కూల్ అండ్ క్లీన్ స్పెషల్ క్యాంపెయిన్ సమావేశం నిర్వహించగా.. డీఈఓ హాజరయ్యారు. ఈమేరకు 5.0పై అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలని, ప్రమాదకర భవనాలు, తరగతి గదులు ఉంటే కూల్చివేయాలన్నారు. పాత బడిన పాఠశాల గదులకు పెయింటింగ్ పనులు చేపట్టాలని, పాఠశాలల్లో ఇంటర్నెట్ సమస్యలున్నా, టెక్నికల్ సమస్యలున్నా పరిష్కరించాలన్నారు. యూడిఐఎస్‌ఈలో ఎంట్రీ, డేటా లోపాలు ఏమైనా ఉంటే సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ స్థాయిలో డిజిటల్ లెర్నింగ్ అమలు, పురోగతి మరియు విద్యార్థుల వినియోగంపై సమీక్షించారు. ల్యాబ్‌ల పంక్షనాలిటి, వనరుల వినియోగం, పెరుగుదల గురించి ఆరా తీశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమయ్యే లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు కొండపేటలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యర్థనా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, శాంతిరాజు, హంపయ్య, రాజేంద్ర, మహ్మద్ ఆజాం పాల్గొన్నారు.


