శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ చేపట్టి బాధితులకు అండగా ఉండాలని డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం వీడియో సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావుతో మాట్లాడారు. జిల్లా పోలీసుల పనితీరు, పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులు, సమస్యలపై వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం చేయాలని, హిట్ అండ్ రన్ ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు సరఫరా చేస్తే కట్టడి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాదిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పట్టిష్ట నిఘా ఉంచాలన్నారు. అనంతరం జిల్లాలో నమోదైన కేసులు, విచారణ, సిబ్బంది పనితీరును ఎస్పీ డీజీపీకి వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శంకర్,డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, టాటబాబు, రవిబాబు ఉన్నారు.


