మత్స్యకారుల ఉపాధికి తోడ్పాటు
ఎర్రవల్లి: మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, ఉపాధికి తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని జిల్లా మత్స్యశాఖ అదికారిణి షకీలాబాను అన్నారు. బుధవారం మండలంలోని కొండేరులో పలు చెరువులలో ప్రభుత్వం వంద శాతం రాయితీలో అందించిన చేప పిల్లలను మత్స్య సంఘం సభ్యులతో కలిసి ఆమె విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలోని పెద్ద చెరువు, లచ్చమ్మ చేరువులో మొత్తం లక్షా ఐదు వేల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. చేప పిల్లలను పంపిణీ చేయడం ద్వారా వేలాది మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. దీని కోసం చెరువు సంఘాల సభ్యులు పలు జాగ్రత్తలు పాటించి చెరువులో నీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. చేప పిల్లలకు అవసరమైన ఫీడ్‌ను సక్రమంగా అందిచాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. దిగుబడి ఎక్కువగా వస్తేనే సంఘం సభ్యులకు అధిక ఆదాయం చేకూరుతుందని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సురేష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజు, మత్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


