ఆయిల్‌పాం సాగుకు మరింత ప్రాధాన్యం
అలంపూర్‌రూరల్: ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తుందని, సాగుకు ముందుకొచ్చే రైతులకు రాయితీపై డ్రిప్, మొక్కలు అందజేస్తుందని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఎంఏ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని క్యాతూర్ రైతువేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో..ఉద్యావనశాఖ, ఆయిల్‌ఫెడ్ సౌజన్యంతో ఆయిల్‌పాంపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకునేందుకు ఏటా ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నాయని, దేశీయంగా ఆయిల్‌పాం సాగు చేస్తే ఇక్కడే నూనె తయారు చేసుకోవచ్చని, విదేశాలపై ఆధారపడడం కొంతవరకు తగ్గుతుందన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో రైతులు ఆయిల్‌పాం సాగు చేస్తే ప్రభుత్వం సహకరిస్తుందని, ఫీల్డ్ ఆఫీసర్లు, అధికారులు రైతులకు సలహాలు సూచనలు అందిస్తూ అండగా ఉంటారని వివరించారు. కొత్తగా ఆయిల్‌పాం సాగుచేసే రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ మేనేజర్ శివ నాగిగెడ్డి, శ్రీనివాస్, రాఘవ రెడ్డి, యశోద తదితరులు పాల్గొన్నారు


