రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటాలి
గద్వాలటౌన్: క్రీడాకారులు నిర్మాణాత్మకమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటాలని అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ మహిళా, పురుషుల కబడ్డీ ఎంపిక పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన క్రీడాకారుల ఎంపిక పోటీలకు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ముఖ్య అతిథులగా హాజరై మాట్లాడారు. క్రీడల పట్టణంగా గద్వాల అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్‌లో రాష్ట్ర స్థాయి పోటీల నిర్వాహణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడాకారులు స్ఫూర్తిదాయకమైన ఆట ద్వారా ప్రతిభ చాటారన్నారు. క్రీడలు జీవితానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని, అందువల్ల వాటిని తప్పని సరిగా ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే సీనియర్, జూనియర్ విభాగాలలో 20 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఎంపిక చేశారు. శిక్షణ తరువాత తుది జట్టును ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల నల్లగొండ జిల్లా నాగర్జునసాగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నర్సింహా, కన్వీనర్ అబ్రహాం, కబడ్డీ అసోసియేషన్ నాయకులు చందు, రవి, సర్వేశ్వర్‌రెడ్డి, సురేష్, శివ, గితన్న, పీఈటీలు హైమావతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


