జ్ఞానాన్ని పెంచే వేదికలు గ్రంథాలయాలు
గద్వాలటౌన్/అలంపూర్: జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు చక్కని వేదికలని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ విజయలక్ష్మి అన్నారు. ఆరో రోజైన బుధవారం గ్రంథాలయ వారోత్సవాలకు డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం వాటికి సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచిందన్నారు. తెలుగు సాంప్రదాయాన్ని కాపాడేలా ముగ్గులు వేసిన ప్రతి విద్యార్థినీ వారు అభినందించారు. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. అంతకుముందు గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొనిస్థానిక గ్రంథాలయం కార్యాలయం, సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. విద్యార్థినులు, మహిళలు ముగ్గుల వేసి సృజనాత్మకతను చాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు, విద్యాశాఖ అధికారి హంపయ్య తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ విజయలక్ష్మి సూచించారు. అలంపూర్ చౌరస్తాలో నిర్వహించిన సమావేశానికి అలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల జెడ్పీహెచ్‌ఎస్, యూపీఎస్, పీఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనగా.. డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. విద్యార్థుల ఆధార్ ఆప్‌డెట్, ఇంటర్‌నేట్ సేవలు, అదనపు గదులు, లైబ్రరీ గదులపై ఆరా తీశారు. ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2, ఎస్‌ఏ–1 మార్కుల వివరాలను ప్రభుత్వ యాప్‌లో ఆప్‌లోడ్ చేయడం పూర్తి చేయాలని సూచించారు. ఇతర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారితోపాటు సెక్టోరియల్ ఆఫిసర్సు హంపయ్య, శాంతిరాజ్, ఏపీఓ శ్రీనివాసులు, ఎంఈఓలు శివప్రసాద్, అశోక్ కుమార్, ఏఈ ఆజాద్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


