చట్టానికి లోబడి దత్తత తీసుకోండి
ఇటిక్యాల: మాతృత్వం ఒక వరమని, అందుకు దత్తత మరో మార్గమని.. చట్టానికి లోబడి దత్తత తీసుకోవాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రవి అన్నారు. బుధవారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బాలల న్యాయ సంరక్షణ చట్టం – 2015 ప్రకారం చట్ట విరుద్ధంగా ఏ ప్రయోజనం కోసం పిలల్లను దత్తత ఇచ్చినా, తీసుకున్నా వారికి మూడేళ్ల కారాగార శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా తప్పదన్నారు. ప్రభుత్వమే కలెక్టర్ ద్వారా సులభంగా వేగంగా న్యాయబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలను దత్తతకు తీసుకోవాల్సిన దంపతులు తమ పాన్‌కార్డ్, దంపతుల ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, దంపతులకు దీర్ఘకాలిక, ప్రాణాంతర వ్యాధులు లేనట్లు ఫిట్నెస్ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం లేదా శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ సంక్షేమ అధికారిని సంప్రదించాలన్నారు. అనంతరం దత్తతకు సంభందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి సిబ్బంది, ఎస్‌విలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


