జోరుగా అక్రమ కట్టడాలు
గద్వాల టౌన్: జిల్లా కేంద్రంలో నివాస, వాణిజ్య అవసరాల కోసం భవన నిర్మాణాలను ఇష్టానుసారంగా నిర్మించుకుంటున్నారు. యజమానులు భవన అనుమతుల సమయంలో తీసుకునే ఫ్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరైతే నిబంధనలకు పాతర వేస్తూ రోడ్డుపైనే నిర్మాణాలు చేపడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నాలుగైదేళ్లుగా బహుళ అంతస్తులు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఒకరిని చూసి మరొకరు నిబంధనలకు పాతర వేసి అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలు చకచకా కొనసాగిస్తున్నారు.
నిబంధనలు గాలికి...
అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కొత్త మున్సిపల్ చట్టంలో పలు నిబంధనలు రూపొందించారు. అందులో ప్రధానంగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తేడాలు లేకుండా కచ్చితమైన ఇంటి కొలతలు ఉండాలి. కొలతల్లో తేడాలు ఉన్నా, నిబంధనలు అతిక్రమించినా 25 రెట్లు జరిమానాతో పాటు వాస్తవ పన్ను విధిస్తారు. అంతేకాక సెట్‌బ్యాక్ నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలి. స్థలం 200 గజాల్లోపు ఉంటే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగతా మూడు వైపులా 3.5 ఫీట్లు వెనక్కి స్లాబు వేసుకోవాలి. 100 గజాల్లోపైతే రోడ్డు వైపు 5 ఫీట్లు, మిగిలిన రెండు వైపుల 2 ఫీట్లు వదలాలి. 20 ఫీట్ల రోడ్డు ఉంటే కచ్చితంగా 5 ఫీట్లు మున్సిపాలిటీకి గిఫ్టు చేయాల్సిందే. ఇదిలా ఉంటే సెట్‌బ్యాక్ స్థలంలో స్లాబు, ప్రహరీ, సెప్టిక్ ట్యాంకు నిర్మించకూడదు. ఇళ్లకు పెట్టే తలుపులు, గేట్లు లోపలి వైపునకు తెరుచుకోవాలి. దీంతో పాటు ఇంటి యజమానులు తీసుకున్న అనుమతులకు భిన్నంగా పై అంతస్తులు నిర్మిస్తున్నారు. అధికారులు తనిఖీకి వచ్చేలోపు నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఈ వ్యవహరంలో సంబంధిత యంత్రాంగం నిర్లక్ష్యంతో పాటు వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతో చర్యలు తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతుంది.
ఎక్కడెక్కడంటే..
మున్సిపల్ పరిధిలో ప్రధానంగా 2, 3, 6వ వార్డుల పరిధిలో సుమారు 40 భవన నిర్మాణాల్లో అనుమతులకు విరుద్ధంగా పై అంతుస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారుల పక్కన సెట్ బ్యాక్ లేకుండా, నివాస అనుమతి తీసుకుని వాణిజ్య దుకాణాలు నిర్మిస్తున్నారు. కొన్ని నిర్మాణాలకు అనుమతులు సైతం తీసుకోలేదని తెలుస్తుంది. వీటితో పాటు శ్రీనివాసకాలనీ, భీంనగర్, పాత హౌసీంగ్‌బోర్డు కాలనీలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారు. 6, 19, 20వ వార్డుల పరిధిలో ఉన్న రీక్రియేషన్, ఇండస్ట్రీయల్ జోన్ పరిధిలో సుమారు 50 వర కు అనుమతులు లేకుండా నిర్మాణాలు ఉన్నాయి.


