రైతులకు సకాలంలో నగదు చెల్లించాలి
గద్వాల న్యూటౌన్/ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు చెల్లింపు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో జమ్మిచేడు వద్ద మెప్మా ఆధ్వర్యంలో, ఎర్రవల్లి మండలంలోని తిమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం వద్ద ఆరబెట్టిన ధాన్యాన్ని చూసి సెంటర్‌లో తేమశాతం, గింజల పరిమాణాన్ని కొలిచే విధానాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీ సంచుల వివరాలపై ఆరా తీశారు. రైతుల సాగు ధ్రువీకరణకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే టోకెన్లు పరిశీలించారు. తూకం అనంతరం మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. కౌలు రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం అరుణ, ఏపీఎం సలోమి, ఏఓలు ప్రతాప్‌కుమార్, సురేష్‌గౌడ్, ఏఈఓలు ప్రవళిక, నరేష్, మెప్మా అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీకర్, మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19న గద్వాల ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్ తన చాంబర్‌లో సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సునంద, సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మో హన్‌రావ్, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.


