యువత మత్తుకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, భవిష్యత్‌పై దృష్టి సారించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్‌పై విద్యార్థులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో యువత గంటల తరబడి గడపడం వల్ల చెడు అలవాట్లకు దారి తీస్తుందన్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసలైతే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి పౌరుడు నార్కోటిక్ డ్రగ్ వారియర్‌గా పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పోలీసుశాఖ మత్తు పదార్ధాల కట్టడికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు, ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
వాహనాదారులు జాగ్రత్త
చలికాలంలో రోడ్లపై పొగ మంచు కమ్ముకోవడంతో వాహనాదారులు స్వీయ జాగ్రత్తలు పాటించి డ్రైవింగ్ చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి ఉండదన్నారు. ఈ క్రమంలో ప్రతి వాహనదారుడు హెడ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వీలైనంత వరకు తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిందని సూచించారు.


