దేశ సమగ్రతను కాపాడుకోవాలి
గద్వాల టౌన్: దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్య సాహసాలు మనందరిలో ప్రతినిత్యం ఐక్యత స్ఫూర్తిని కలిగిస్తాయని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషిచే యాలని అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు పిలుపునిచ్చారు. భారత మాజీ హోంశాఖ మంత్రి, ఉప ప్రధాని వల్లభాయ్‌పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏక్ భారత్, ఆత్మ నిర్భర భారత్ నినాదంతో నెహ్రూ యువకేంద్రం సహకారంతో యూనిటీ మార్చ్ (ఐక్యత పాదయాత్ర) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు జెండా ఊపి ఐక్యత మార్చ్‌ను ప్రారంభించగా.. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక తేరుమైదానంలో జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే లక్ష్యం అన్న భావనతో కలిసి ఉన్నప్పుడే పటేల్ కలలుగన్న సమైక్య భారత నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. విశ్వాసం, బలం, ఐక్యత ద్వారానే పౌరులు గొప్ప కార్యాలు సాధిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సమైక్యత ప్రతిజ్ఞను చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా అధికారి కోటా నాయక్, పాదయాత్ర కమిటీ కన్వీనర్ బండల వెంకట్రాములు, కోకన్వీనర్ అనిల్‌కుమార్, బీజేపీ నాయకులు రామంజనేయులు, రామచంద్రారెడ్డి, శ్యామ్‌రావు, దేవదాసు, పాండు, సాయి, మధుగౌడ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


