ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దు
అలంపూర్: పంట సాగు చేసిన రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ సహకారంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం నాణ్యతగా ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు. కేంద్రానికి తీసుకొచ్చే ధాన్యంలో తెగులు సోకిన, రంగు మారిన గింజలను సాధ్యమైనంత వరకు తొలగించి అధికారులకు సహకరించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు తమ దృష్టికి తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం చంద్రమౌళి, మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెన్న, పీఏసీఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దిలేటి, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్ రెడ్డి, పీఏసీఎస్ ఇన్‌చార్జి సీఈఓ శ్రీనివాసులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


