ఎత్తిపోతలు ఉత్తిపోతలేనా
టీబీ డ్యాం వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాటుచేయని నూతన క్రస్టు గేట్లు
● తెలంగాణ వాటా 9 టీఎంసీలు వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆందోళన
● సుంకేసుల బ్యారేజీ దిగువన వున్న ఎత్తిపోతలకు యాసంగిలో నీటి విడుదల ప్రశ్నార్థకం
● టీబీ డ్యాంలో గేట్ల నిర్మాణానికి 40 టీఎంసీలు దిగువకు విడుదల చేస్తామని అధికారుల స్పష్టం
● ఆ నీటిని సుంకేసులలో నిల్వచేసి ఎత్తిపోతలకు అందించాలని కోరుతున్న రైతులు
నదిలో నీరుండేలా చూడాలి
తుంగభద్ర నది నుంచి లిఫ్ట్‌లకు నీటిని మోటార్ల ద్వారా తీసుకుంటాం. ప్రస్తుతం మొక్కజొన్న విత్తనాలు వేయడానికి పొలాలు తడుపుతున్నాం. విత్తనాలు వేశాక నదిలో నీరు ఇంకిపోతే మా పరిస్థితి ఏమి. పంటలు ఎండిపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అటు వానాకాలం పంటలు నష్టపోయాం. ఇటు యాసంగి పంటలు ఎండిపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. తెలంగాణ వాటా నీటిని విడతల వారీగా విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– లక్ష్మినారాయణ, బుడమర్సు
లిఫ్ట్ చైర్మన్, బుడమర్సు
నీరు విడుదల
చేయకపోతే ఎలా
ఏటా తెలంగాణ వాటా కింద తుంగభద్ర నదికి నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది ఎన్ని టీఎంసీలు విడుదల చేస్తారు, ఏ నెల వరకు విడుదల చేస్తారనే విషయం ఇప్పటివరకు అధికారులు ప్రకటించలేదు. టీబీ డ్యాం వద్ద కొత్త గేట్లు అమర్చుతున్నారని చెబుతున్నారు. గేట్ల కొరకు డ్యాంలో నీరంతా దిగువకు విడుదల చేస్తారని సమాచారం. ఒకే సారి డ్యాంలో నీటిని విడుదల చేస్తే మేం సాగుచేసే మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతాయి. రైతుల గురించి ఆలోచించి నీటిని విడతల వారీగా విడదల చేస్తే మంచిది. ఈమేరకు నిర్ణయం తీసుకోవాలి. – ఉప్పరి రాముడు,
ఆయకట్టు రైతు, బుడమర్సు
టీబీ బోర్డు సమావేశం తర్వాత వెల్లడిస్తాం
ఈ నెల 23న టీబీ బోర్డు సమావేశం నిర్వహించనున్నాం. ఈ సమావేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేష్, తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులం అందరం కలిసి చర్చిస్తాం. అందరి ఆలోచన మేరకు నీటి విడుదలపై ప్రకటన చేస్తాం. – శ్రీనివాసులు, డీఈఈ,
నీటిపారుదలశాఖ, జోగుళాంబ గద్వాల
శాంతినగర్: తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరందించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది యాసంగిలో సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అలంపూర్ నియోకవర్గంలోని వడ్డేపల్లి, రాజోళి, మానవపాడు మండలాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు తుంగభద్ర నది నుంచి నీరందే పరిస్థితి అగుపించడంలేదు. అలంపూర్ నియోజకవర్గంలో తుంగభద్ర నీటిపై ఆధారపడి మూడు లిఫ్ట్‌లు బుడమర్సు–1, బుడమర్సు–2, మద్దూర్ లిఫ్ట్‌లు వున్నాయి. ఆయా లిఫ్టుల క్రింద వందల ఎకరాల్లో ఆయకట్టు సాగవుతుంది. ఈ ఏడాది మొక్కజొన్న పంట కొందరు సాగుచేయగా మరికొందరు పొలాలు చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు. బుడమర్సు–1 లిఫ్ట్ కింద 700 ఎకరాలు, బుడమర్సు–2, 500 ఎకరాలు, తూర్పుగార్లపాడు 300 ఎకరాలు, రాజోళి లిఫ్ట్ కింద 2వేల ఎకరాలు, పంచలింగాల లిఫ్ట్ కింద తెలంగాణ రైతులకు సంబంధించి 500 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అంతేగాక తుంగభద్ర నది నుంచి పైప్‌లైన్‌ల ద్వారా మద్దూరు శివారులో 400 ఎకరాలు, కొర్విపాడు, గోకుల పాడు శివారులో 500 ఎకరాలు, పుల్లూరు, కలుగోట్ల శివారులో మరో 600 ఎకరాలు యాసంగిలో సాగుచేస్తారు. ఈ ఏడాది వానాకాలంలో అతివృష్టి వల్ల పత్తి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారు. తుంగభద్ర నదిలో నిల్వ వుండే నీటితో యాసంగిలో మొక్కజొన్న పంట సాగుచేసి నష్టాలు పూడ్చుకుందామని రైతులు సమాయత్తమైన తరుణంలో టీబీ డ్యాం నుంచి నీరు రావనే సంకేతాలు అందడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర నదిలో నీరుచేరకపోతే ఇప్పటికే సాగుచేసిన మొక్కజొన్న పంటలు సుమారు 2,500 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి పొంచి ఉంది.
విడతల వారీగా
నీరు విడుదల చేస్తేనే..
టీబీ డ్యాం వద్ద కొత్తగా క్రస్టు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్యాంలో నిల్వ వున్న 80 టీఎంసీల నీటిలో మరో 40 టీఎంసీల నీరు దిగువకు వదిలితేనే గేట్లు అమర్చడానికి వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. డ్యాం నుంచి విడుదల చేసే నీరు విడతల వారీగా వదలాలని రైతులు కోరుతున్నారు. అయితే, టీబీ డ్యాం నుంచి ఒకేసారి 40 టీఎంసీలు విడుదల చేస్తే సుంకేసుల బ్యారేజీ నుంచి ఏకంగా దిగువన వున్న శ్రీశైలం జలశయానికి చేరుకుంటాయని, పంటలకు ఉపయోగపడవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం పంటలు సాగుచేయడానికి అవసరమైనన్ని నీళ్లు వున్నాయని, టీబీ డ్యాం నుంచి తెలంగాణ వాటాగా విడుదలయ్యే నీటిని విడతల వారీగా విడుదల చేయకపోతే నదిలో నీరులేక పంటలు ఎండిపోతాయని, వానాకాలంలో నష్టపోయామని, యాసంగిలో అదే పరిస్థితి ఏర్పడితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతలు ఉత్తిపోతలేనా
ఎత్తిపోతలు ఉత్తిపోతలేనా
ఎత్తిపోతలు ఉత్తిపోతలేనా


