‘పల్లెటూరి కురాళ్ల’కు ప్రశంసలు
ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని అవగాహన కలిగించేందుకు అయిజ మండలంలోని కొందరు యువకులు తీసిన షార్ట్‌ఫిల్మ్‌కు రాష్ట్ర స్థాయి గుర్తింపు దక్కింది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలానికి చెందిన పులికల్, రాజాపురం, కిసాన్‌నగర్, బైనిపల్లి గ్రామాలకు చెందిన యువకులు కలిసి ‘పల్లెటూరి కుర్రళ్లు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అయితే, పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో వీరు తీసిన షార్ట్‌ఫిల్మ్ రెండో బహుమతిని గెలుచుకుంది. ఈమేరకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఎల్బీనగర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి చేతుల మీదుగా విజేతలు బహుమతిని అందుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎస్పీ శ్రీనివాసరావు వీరిని అభినందించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వాహనాలను పట్టుకునే క్రమంలో ‘రెకమండేషన్లు కాదు.. రోడ్డు భద్రతా నియమాలే మన ప్రాణాలు కాపాడతాయి..’ అని ప్రజలకు అర్థమయ్యేలా షార్ట్‌ఫిల్మ్ తీయడం ఎంతో అభినందనీయమని ఎస్పీ అన్నారు. రాష్ట్ర స్థాయిలో రెండవ బహుమతి జిల్లాకు రావడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు.
గద్వాల క్రైం/అయిజ:


