ఊతమిస్తేనే ఊరట..!
సమస్యలు పరిష్కరిస్తాం
వసతులు కల్పిస్తే..
గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కరువు
● సిబ్బంది కొరత.. అసంపూర్తి
భవనాలతో తప్పని తిప్పలు
● పోటీ పరీక్షలతో పెరుగుతున్న పాఠకులు
● ప్రారంభమైన గ్రంథాలయ
వారోత్సవాలు
గద్వాలటౌన్: సెస్సు బకాయిలు.. సిబ్బంది కొరత.. ధరిచేరని పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంటర్నెట్.. అద్దె భవనాలు.. ఇలా సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు మారాయి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల నుంచి గ్రంథాలయాల సెస్సు వసూలు చేస్తున్నా దాన్ని జిల్లా గ్రంథాలయ శాఖకు జమ చేయడం లేదు. గ్రంథాలయ వ్యవస్థపై ఆర్థిక భారం పెరిగి సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. నవంబరు 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు.
అడుగడుగునా.. నిరాదరణ
జిల్లా కేంద్రమైన గద్వాల మినహా మిగిలిన శాఖ గ్రంథాలయాలకు వచ్చిన పుస్తకాలు, చదివే పాఠకుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. మొదట్లో గ్రంథాలయానికి వచ్చిన పుస్తకాలు తీసుకెళ్లే పాఠకులు నెలకు వందల సంఖ్యలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. ఆ సంఖ్య నేడు పూర్తిగా పడిపోయింది. ప్రధానంగా నిరుద్యోగులకు అవసరమైన పోటీ పుస్తకాలు, కంటెంట్ పుస్తకాలు, కెరీర్‌గైడెన్స్, రెఫరెన్స్ పుస్తకాలతో పాటు బ్యాంకింగ్, రైల్వే, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పుస్తకాలు శాఖ గ్రంథాలయాలలో లేకపోవడంతో అవి నిరాదరణకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం గద్వాలలో రూ.1.65 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో జిల్లా గ్రంథాలయంతో పాటు 9 శాఖ గ్రంథాలయాలు, నాలుగు గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో అవసరమైన స్థాయిలో అధికారులు సిబ్బంది పనిచేయడం లేదు. కేవలం గద్వాల, అలంపూర్ శాఖా గ్రంథాలయాల్లో మాత్రమే రెగ్యులర్ లైబ్రేరియన్‌లు పనిచేస్తున్నారు. మిగిలిన చోట్ల ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం సిబ్బంది ద్వారా నడుతుపున్నారు. లైబ్రేరియన్లు, రికార్డు అసిస్టెంట్లు, క్రిందిస్థాయి సిబ్బంది నియామకాలు జరగకపోవడం వల్ల వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం.. స్థానిక సంస్థల నుంచి వచ్చే సెస్సు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధు లు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు చేపడతాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాం. కొంతమంది సూచనల మేరకు దాతల సహకారంతో మరికొన్ని పోటీ పరీక్షల పుస్తకాలు తెప్పించాం. మహిళలు చదువుకోవడానికి గ్రంథాలయంలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయడం జరిగింది.
– నీలి శ్రీనివాసులు,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
జిల్లాలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువతతో పాటు పాఠశాల స్థాయి విద్యార్థులు వేల సంఖ్యలో ఉంటారు. ఇలాంటివారికి అవసరమైన సాంకేతికతను, కొత్త పంథాను గ్రంథాలయాల్లో అందించే దిశగా పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరముంది. ముఖ్యంగా నిర్వహణ నిధులతో పాటు స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన సెస్సు విషయంలోనూ ప్రత్యేక దృష్టి సారించాలి. వాటి నిధులతో సకల వసతుల్ని సమకూర్చాలి. కమిటీ పర్యవేక్షణలో జిల్లాలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు అవసరమైన పుస్తకాల్ని కొనుగోలు చేయాలి. వారోత్సవాల నిర్వహణలో వీటి ప్రాధాన్యతపై విస్తృత ప్రచారంతో పాటు వీటి ప్రగతి దిశగా కార్యాచరణ రూపొందించి ఆచరణలో చూపించాలి.
ఊతమిస్తేనే ఊరట..!
ఊతమిస్తేనే ఊరట..!


