ప్రతిభను గుర్తించేందుకు ఖేలో ఇండియా పోటీలు
గద్వాలటౌన్: గ్రామీణ నేపథ్యం ఉన్న క్రీడాకారిణుల్లో శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉంటాయనే కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’ అస్మిత లీగ్ పేరిట జాతీయ స్థాయి అథ్లెటిక్స్ టోర్నీ నిర్వహిస్తుందని డీవైఎస్‌ఓ కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అధారిటి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అస్మిత (అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్ బై ఇన్స్‌ప్‌పైరింగ్ ఉమెన్) లీగ్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. బాలికలకు అండర్–14, అండర్–16 విభాగాలలో 60 మీటర్లు, 600 మీటర్లు, లాంగ్‌జంప్, హైజంప్, జావలిన్ త్రో, డిస్కుత్రో పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం ప్రతిభ చాటిన క్రీడాకారిణులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస మౌలిక వసతులు లేని ప్రాంతాల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటారని, వారిని గుర్తించి తర్ఫీదు ఇచ్చేందుకే ఈ పోటీలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


