బీసీల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
ఎర్రవల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లును వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ రక్షణ కల్పించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక బీసీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రణభేరి బహిరంగ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్నారు. బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. బీసీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని, బీసీల సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యంగ విరుద్ధమన్నారు. ఇది ముమ్మాటికి బీసీలను రాజకీయంగా వెనక్కి నెట్టే కుట్ర అని మండిపడ్డారు. నామినేటెడ్ పదవులను జనాభా ప్రాతిపదికన బీసీలకు కేటాయించాలన్నారు.


