పని చేసేందుకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు!
మహబూబ్‌నగర్ క్రైం: పాత భవనం రేనోవేషన్ పనులు చేయడానికి వెళ్లిన ఇద్దరు దినసరి కూలీలు.. ఆ భవనం కూలి శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని పాత తోట ప్రాంతంలో సంపు లక్ష్మణ్‌కు చెందిన ఒక పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఈ భవనంలో మనోహర్ కిరాణం దుకాణానికి సంబంధించిన సరుకులు నిల్వ చేసేందుకు గోదాంలా ఉపయోగించుకుంటున్నాడు. అయితే గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంపు లక్ష్మణ్ దగ్గర పని చేసే గుమస్తా రాజు పాత బస్టాండ్ దగ్గర అడ్డాపై ఉన్న ఇద్దరు కూలీలు నవాబ్‌పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన గద్వాల కృష్ణయ్య(45), భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌కు చెందిన కుమ్మరి శాంతయ్య(60) పని కోసం తీసుకువచ్చాడు. అయితే ఒకవైపు ఇద్దరు కూలీలు పాత ఇంటికి అనుకొని ఉన్న రావిచెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మరో యువకుడు గోడలకు డ్రీల్ చేసే పనిలో ఉండగా.. అకస్మాత్తుగా గొడలు కూలడంతో గమనించిన ఆ యువకుడితో పాటు గుమస్తా రాజు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో కొట్టేసిన చెట్టె లాగుతూ ఇద్దరు కూలీలు అటువైపు రాగా.. స్లాబ్ కూలి ఇద్దరిపై పడింది. దీంతో వారు శిథిలాల కింద చిక్కుకొని అక్కడిక్కడే మృతి చెందారు. జేసీబీ సహాయంతో దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి సాయంత్రం 4.48 గంటల ప్రాంతంలో మొదటి మృతదేహం బయటకు తీశారు. సాయంత్రం 5.20 ప్రాంతంలో రెండో మృతదేహం వెలికితీశారు. సహాయ చర్య పనులను కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం పరిశీలించారు.
● మహబూబ్‌నగర్‌లో కూలిన పాత భవనం
● శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు కూలీలు మృతి
గద్వాల కృష్ణయ్య (ఫైల్)
కుమ్మడి
శాంతయ్య (ఫైల్)
పని చేసేందుకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు!
పని చేసేందుకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు!


