రూ.2.88 కోట్ల ధాన్యం గోల్‌మాల్
● పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్ సప్‌లైశాఖ అధికారులు
● మిల్లు యజమానిపై కేసు నమోదు
గద్వాల క్రైం: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా చేసి ఇచ్చేందుకు మిల్లుకు కేటాయించగా.. దాదాపు రూ.2.88 కోట్ల ధాన్యం గోల్‌మాల్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని శ్రీరామ రైస్‌మిల్లుకు ప్రభుత్వం 2022–23, 24–25 వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన రూ.2.88 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని కేటాయించింది. ఈ క్రమంలో సదరు మిల్లు యజమాని ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని అప్పజెప్పకపోవడంతో ఈ ఏడాది అక్టోబర్ 18న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మిల్లులో తనిఖీ చేశారు. దీంతో 1049.600 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పక్కదారి పట్టించారని, సదరు యజమాని అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. ఈ ధాన్యం విలువ రూ.2.88 కోట్లుగా నిర్ధారించారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సివిల్ సప్‌లైశాఖ అధికారులకు నివేదించారు. ఈ నివేదికల ఆధారంగా 30.10.2025 తేదీన సివిల్ సప్‌లై శాఖ జిల్లా మేనేజర్ విమల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిల్లు యజమాని పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు విషయం ఇన్నాళ్లు విచారణ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ విషయంపై గద్వాల సీఐ శ్రీనును ‘సాక్షి’ వివరణ కోరగా.. సివిల్ సప్‌లై శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమానిపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలాఉండగా, ఈ నెల 4వ తేదీన సదరు మిల్లు యజమాని ఈ కేసు విషయమై హై కోర్టులో ముందుస్తు బెయిల్ పొందినట్లు తెలుస్తోంది.


