పెండింగ్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లా వ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాలలో చేపట్టిన మరుగుదొడ్లు, నీటివసతి తదితర పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో అంగన్‌వాడీ కేంద్రాలలో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటివసతి, విద్యుత్ సౌకర్యం తదితర పనులు సకాలంలో పూర్తికాకపోవటానికి కారణాలపై ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి డిసెంబర్ 15లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు కూడా ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో మొత్తం 69 అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో కూరగాయల సాగుకు అవసరమైన ఏర్పాట్లు ఈ నెల చివరిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలలో నిర్దేశిత గడువులోగా కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై తాను తరచూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, సంబంధిత ఇంజినీర్లు సైతం క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో పీఆర్ ఈఈ ప్రభాకర్, జిల్లా సంక్షేమ అధికారి సునంద, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, హాల్టికల్చర్ అధికారి అక్బర్, మిషన్‌భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈలు, సీపీడీవోలు పాల్గొన్నారు.


