విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
గట్టు: విద్యార్థులు సామాజిక మాద్యమాలకు దూరంగా ఉంటూ, చదువుపైనే దృష్టి సారించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం తప్పెట్లమొర్సు, గొర్లఖాన్‌దొడ్డి గ్రామాల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీ లక్ష్యం నిన్ను నిద్రపోనివ్వకపోతేనే.. ఆ లక్ష్యం నీ జీవితాన్ని మార్చుతుందని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, సమయాన్ని చదువుకు వినియోగిస్తే తప్పకుండా మంచి ఫలితాలను రాబట్టవచ్చునని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని, దాన్ని సాధించే దిశగా అడుగులు ముందుకు వేయాలన్నారు. లక్ష్య సాధనకు ప్రణాళిక, క్రమ శిక్షణ, సమయపాలన అత్యంత అవసరమని, విజయం కోసం భయం, సోమరితనం, దూరం పెట్టి నిరంతర కృషి, అంకిత భావంతో చదువుకోవాలన్నారు.రోజూ 7గంటల నిద్ర, 8 గంటల చదువు, 9 గంటలు ఇతర పనులు చేయాలని, సమయాన్ని వృథా చేయకుండా క్రమ శిక్షణతో చదువుకోవాలన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల మధ్యాహ్నా భోజనాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


