ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం మండలంలోని కోదండాపురం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, యూనిఫాం టర్న్ ఔట్ తదితర అంశాలను పరిశీలించి సిబ్బందితో కేసుల విషయమై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పీఎస్ పరిదిలోని జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, రాత్రి సమయంలో రోడ్డు పక్కన వాహనాలు నిలిపి నిద్రించే డ్రైవర్లకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. రోడ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పనిచేయాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరపాలని సూచించారు. సైబర్ నేరాల నివారణకు కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల మొయింటెనెన్స్‌పై సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డిఎస్పీ మొగిలయ్య, సిఐ రవిబాబు, ఎస్సై మురళి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


