నదీ తీర ప్రాంతాలే అడ్డాగా..
ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు రెండు దశాబ్దాల కిందట గద్వాల ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన నిషేదిత క్యాట్‌ఫిష్ చేపలను పెంచుతున్నారు. ఇందుకోసం సంవత్సర కాలంపాటు నీళ్లు అందుబాటులో ఉండే పొలాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే కృష్ణానది తీరప్రాంతాలైన ధరూరు మండలం ఉప్పేరు, గార్లపాడు, నెట్టెంపాడు, ఖమ్మంపాడు, గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం, చెనుగోనిపల్లి, గుంటిపల్లి, ఎర్రవల్లి మండలం తిమ్మాపురం, షేక్‌పల్లి,బీచుపల్లి, అదేవిధంగా తుంగభద్ర తీరప్రాంతాలైన మద్దూరు, పెద్దతాండ్రపాడు తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని స్థిరపడ్డారు. ఈప్రాంతాల్లో అక్రమంగా నిషేధిత క్యాట్‌ఫిష్‌ను పెంచుతూ వాటిని హైదరాబాద్, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీటిపై గతంలో మీడియాలో అనేక కథనాలు రావడంతో అధికారులు దాడులు నిర్వహించి ధ్వంసం చేసినప్పట్టికీ అక్రమార్కులు రూటుమార్చి క్యాట్‌ఫిష్‌ను సాగుచేస్తున్నారు. క్యాట్‌ఫిష్ చెరువులు సులువుగా గుర్తించేందుకు వీలు లేకుండా అక్రమార్కులు ఫంగస్ చేపల చెరువుల మధ్య పెద్ద మొత్తంలో క్యాట్‌ఫిష్ చెరువులు ఏర్పాటు చేసి ప్రమాదకరమైన క్యాట్‌ఫిష్‌ను సాగుచేస్తున్నారు.


