పకడ్బందీగా చిన్న నీటి వనరుల గణన
గద్వాల: జిల్లాలోని చిన్ననీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో దేశవ్యాప్తంగా ఐదేళ్లకోసారి నిర్వహించే 7వ మైనర్ ఇరిగేషన్ రెండవ వాటర్‌బాడీస్ సెన్సెస్ జిల్లాలో ఏవిధంగా నిర్వహించాలని అంశంపై జిల్లా స్థాయిస్టీరింగ్ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్నపారుదల వనరుల గణన ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలని ఆదేశించారు. రెండువేల హెక్టార్ల లోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణన మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశాల జారీ చేసిందన్నారు. మొదట ఒక గ్రామాన్ని యూనిట్ తీసుకుని గణన పూర్తిచేసిన అనంతరం తదుపరి గ్రామాల గణనను కొనసాగించాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, నీటిపారుదల శాఖ ఏఈలు, మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. గ్రామస్థాయిలో పంచాయతీకార్యదర్శులు ఏఈవోలు ఎన్యూమరేటర్లుగా కొనసాగుతారని తెలిపారు. జిల్లాలో ఉన్న 202 రెవెన్యూ గ్రామాల్లో చిన్ననీటి వనరుల గణన కోసం అవసరమైతే ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్స్‌ను కూడా ఎన్యూమరేటర్లుగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటలు, ఇతర జలవనరుల వివరాలు సేకరించడంపై అందరూ ఎన్యూమనరేటర్లకు జిల్లా మండలాల స్థాయిలో త్వరితగతిన శిక్షణ పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, సీపీవో పాపయ్య, నీటిపారుదల శాక ఈఈ శ్రీనివాసులు, భూగర్భజల వనరుల శాఖ డీడీ మోహన్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ ప్రభాకర్, విద్యుత్‌శాఖ డీఈ తిరుపతిరావు, డీఎస్‌వో హరికృష్ణ, హైమావతి, డీఆర్డీఏ తదితరులు పాల్గొన్నారు.
యూడైస్‌లో వివరాలు
పక్కాగా నమోదు చేయాలి
యూడైస్‌లో పాఠశాలలు, విద్యార్థులకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. మండలాల వారీగా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌళిక వసతులకు సంబంధించిన వివరాలు యూడైస్‌లో నమోదయ్యే సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన యాప్‌ల నిర్వాహణ, డాటా నమోదు, పాఠశాలల పనితీరు పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా ఏఐ ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనావేసి, వ్యక్తిగత విద్యా మద్దతు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫౌండేషనల్ లిటరసి అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని పాఠశాలల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఇంటర్‌నోడల్ అధికారి హృదయరాజు, డీఈవో విజయలక్ష్మీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, సెక్టోరియల్ అధికారులు అంపయ్య పాల్గొన్నారు.


