చేనేత రుణమాఫీ అమలు చేయాలి
రాజోళి: చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే కార్మికుల ఆగ్రహ చర్యలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. వెంటనే రుణమాఫీ అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు. రాజోళిలో చేనేత రుణమాఫీ కోసం మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, చేనేత కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రాజోళి పుర వీధుల్లో చేనేత కార్మికుల సమస్యలను విన్నవిస్తూ, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ పి.రామ్మోహన్‌కు వినతి పత్రం అందచేశారు. అనంతరం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు చేయకపోవడం వల్ల కార్మికులు తమ జీవనోపాధికి దూరమవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా తమ గోడును వినకుండా, కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందని, వారి కడుపుకొడుతుందని అన్నారు. చేనేత రుణమాఫీతో పాటు, పథకాల అమలుకు, కార్మికుల హక్కుల సాధనకు ఈ నెల 20న హైద్రాబాద్‌లోని చేనే,జౌళి శాఖ కమీషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మహాధర్నాకు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దోత్రే శ్రీను, చేనేత కార్మికులు పాల్గొన్నారు.


