ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
మానవపాడు: నీటి వసతులున్న వ్యవసాయ క్షేత్రల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మహ్మద్ అలీ అక్బర్ సూచించారు. బుధవారం మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుకు చీడపీడలు సోకే ఆస్కారం తక్కువని, మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత ఏటా ఎకరానికి 8 నుంచి 12 టన్నుల ఆయిల్‌పామ్ కాయల దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగుచేయాలనుకునే రైతులకు మొక్కలకు 90 శాతం రాయితీ, డ్రిప్ ఏర్పాటుకు 80శాతం నుంచి వందశాతం రాయితీ వస్తుందని, మొక్కలు ఎదిగే వరకు నాలుగేళ్ల వరకు ఎకరానికి రైతుకు రూ.4200 చొప్పున ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఒకసారి మొక్కలు నాటితే 30ఏళ్ల పాటు రైతు దిగుబడి పొంతాడన్నారు. కేవలం నీరు అందించి, పైపాటు ఎరువులు అందిస్తే సరిపోతుందని, మార్కెట్‌కు దిగులు పాడాల్సిన అవసరం లేదని, ఈ పంటలో అంతర పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో శివనాగిరెడ్డి, రాజశేఖర్, త్రివిక్రమ్, యశ్వంత్, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, పోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


