గల్లీ గల్లీలో గంజాయి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో గల్లీగల్లీలో గంజాయి గుప్పుమంటుంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి మహమ్మారి ఇప్పుడు పల్లెలోకి ప్రవేశించింది. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని క్రయవిక్రయాలు చేపట్టేస్థాయికి చేరుకుంది. గంజాయికి బానిసలుగా మారిన యువతే విక్రేతలుగా అవతారం ఎత్తుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు, పోలీసులు జరుపుతున్న దాడుల్లో 16–30 ఏళ్ల వయసు వారే అత్యధికంగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. చదువులతో పాటు జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా మెడికల్, ఫార్మసీ, నర్సింగ్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంటర్ వంటి కళాశాల దగ్గర ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలకు తెగబడుతున్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, గద్వాల, నారాయణపేట కేంద్రాల్లో సరఫరా అధికంగా ఉంటోంది. హైదరాబాద్, సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, ఒడిశా, యూపీ నుంచి కూడా కొందరు గంజాయి తెప్పించి విక్రయిస్తున్నారు. ఉమ్మడి పాలమూరులో జిల్లాలో ఈ ఏడాది ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో 41 కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 17, వనపర్తిలో 8, గద్వాలలో 4, నాగర్‌కర్నూల్‌లో 6, నారాయణపేటలో 6 కేసులున్నాయి. ఇదే స్థాయిలో పోలీసుశాఖ ఆధ్వర్యంలోనూ గంజాయిను పట్టుకొని కేసులు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు
మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ పోలీసులు చేసిన విచారణలో పీజీ మెడిసిన్ చదువుతున్న ముగ్గురు వైద్యులు ఎండు గంజాయి వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. వారితో పాటు ఎంబీబీఎస్, నర్సింగ్, పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు వీటిని అధికంగా వాడుతున్నట్లు తేలింది. మహబూబ్‌నగర్‌లో ఒకరిద్దరూ ప్రాక్టీస్‌లో ఉన్న వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఆటో డ్రైవర్లు, పెయింటర్స్, చదువు వదిలేసి తిరుగుతున్న టీనేజర్లు గ్రూప్‌లుగా ఏర్పడి గంజాయి విక్రయించడంతో పాటు వాడకం మొదలుపెట్టారు. ఐదు గ్రాముల ఎండు గంజాయి పాకెట్‌ను రూ.500లకు విక్రయిస్తుంటే.. కేజీ ఎండు గంజాయి రూ.1 లక్షకు విక్రయిస్తున్నారు. ఎండు గంజాయిని ఒక లిక్విడ్‌లో బాగా ఉడికించిన తర్వాత చాక్లెట్స్ మాదిరిగా తయారు చేయడంతో పాటు యాషెష్ అయిల్‌గా తయారు చేసి అందులో వచ్చే లిక్విడ్ సీరంను సిగరెట్లలో చుక్కలు చుక్కలుగా వేసుకొని పీలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ గ్యాంగ్ రాత్రివేళ గంజాయి మత్తులో పట్టణంలో బీభత్సం సృష్టించారు. దీంతో 13 మంది యువకులను అరెస్టు చేయడంతో పాటు మరో 25 మందిని బైండోవర్ చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గోకుల్‌నగర్‌లో గంజాయి మత్తులో ఓ యువకుడు కన్నతల్లిని పారతో నరికి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దపూర్ వద్ద ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై గంజాయి మత్తులో ఇద్దరు యువకులు దాడి చేశారు.
19 ఇంటెలిజెన్స్ బృందాల ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో 14 ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నాలుగు డీటీఎఫ్ బృందాలు, 19 ఇంటెలిజెన్స్ బృందాలు ఏర్పాటు చేశాం. ఇంటెలిజెన్స్ బృందాలు నిత్యం ఆయా స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా, కొనుగోలు విక్రయాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే సమాచారం తెలుసుకుని తనిఖీలు చేసి సీజ్ చేయాల్సి ఉంటుంది. ఒడిశా, బిహార్, యూపీ కూలీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. విద్యార్థుల్లో 2 నుంచి 3శాతం మంది గంజాయి వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. వీరు మిగిలిన విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు. దీనిని కట్టడి చేసేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు గంజాయి వాడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – విజయ్‌భాస్కర్‌రెడ్డి, డీసీ ఎకై ్సజ్ శాఖ
ఈ నెలలో నమోదైనగంజాయి కేసులు
నవంబర్ 11వ తేదీ... మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ సుష్మ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున అప్పన్నపల్లి సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తుంటే బ్రిజేష్‌కుమార్, శ్రీరాజ్ అనే ఇద్దరూ యువకులు ద్విచక్ర వాహనంలో 150 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తుంటే పట్టుకున్నారు. బిహార్‌కు చెందిన బ్రిజేష్‌కుమార్ కొన్నిరోజుల నుంచి జడ్చర్ల మండలం ముదిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ బీరువాల తయారీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల బిహార్‌కు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో తీసుకొచ్చిన గంజాయిని మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాసకాలనీకి చెందిన శ్రీరాజ్‌కు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరి నుంచి 150 గ్రాముల గంజాయి, ఒక బైక్, ఒక ఫోన్ సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే రోజు నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరులో 100 గ్రామలు గంజాయిని సీజ్ చేసి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నవంబర్ 10వ తేదీ.. కోయిలకొండ మండలం గార్లపాడ్ వద్ద 260 గ్రాములు, జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో 305 గ్రామలు ఎండు గంజాయిని పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నవంబర్ 2వ తేదీ... నారాయణపేట జిల్లా కృష్ణా పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో 12.4 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నారాయణపేటతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన పది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నవంబర్ 7వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి సమీపంలోని ఓ వెంచర్‌లో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని 138 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు.
నవంబర్ 6వ తేదీన జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా గేట్ వద్ద ఓ వ్యక్తిని అరెస్టు చేసి 116 గ్రాములు, నవంబర్ 1వ తేదీన జడ్చర్ల పట్టణంలో నలుగురు యువకులను అరెస్టు చేసి 240 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు.
పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్న మహమ్మారి
బానిసలుగా మారుతున్న యువకులు, విద్యార్థులు
మెడికల్, ఇతర కళాశాలల వద్ద గంజాయి అడ్డాలు
ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరఫరా


