నిరంతర సాధన చేస్తే విజయం తథ్యం
గట్టు: ప్రతి విద్యార్థి నిరంతర సాధన, పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధిస్తారని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డాక్టర్ ప్రియాంక తెలిపారు. కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశాల మేరకు మంగళవారం బోయలగూడెం ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను ప్రియాంక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని బాగా అర్థ చేసుకొని, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే వంద శాతం ఫలితం ఉంటుందన్నారు. విద్య అనేది మనకు లభించిన గొప్ప వరమని, చదువుకోవాలనే కోరిక బలంగా ఉంటే ఎలాంటి సబ్జెక్టు అయినా సులభంగా నేర్చుకోవచ్చన్నారు. విజయానికి మార్గం నిరంతర కృషి, సమయపాలన, ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. పరీక్షలు కేవలం మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం రాయాలని సూచించారు. డిజిటల్ సాధనాలను సద్వినియోగం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులుకు సూచించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


