‘పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు’
ఉండవెల్లి: పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా.. సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే విజయుడు అధికారులకు సూచించారు. ‘కొనుగోళ్లలో కొర్రీలు’ అనే శీర్షిక మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఎమ్మెల్యే విజయుడు స్పందించి ఉండవెల్లి శివారులోని సీసీఐ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకొని సీసీఐ అధికారితో మాట్లాడారు. ప్రతి రైతు పత్తిని సాగు చేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు అనేక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. వర్షాలకు పత్తి దిగుబడి తగ్గి, ఆర్థికంగా నష్టపోతుంటే సీసీఐ అధికారులు సైతం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కపాస్ యాప్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. అకాల వర్షాల కారణంగా పత్తి రంగు మారిందని, తేమ శాతం విషయంలో కొన్ని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఆదేశించినా.. అధికారులు రైతులను ఇ బ్బందులకు గురిచేస్తున్నారని అసహనం వ్య క్తం చేశారు. ఉన్నతాధికారులు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీసీఐ అధికారి రాహుల్‌పై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్, మార్కెటింగ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
‘పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు’


