పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గద్వాల: పాఠశాలలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వజ్ర ఫంక్షన్‌హాల్‌లో డీఆర్‌డీఏ యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిశోర బాలికల సమస్యలు, పాఠశాలలో వాష్ వాటర్ శాంక్షన్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చదువుకునే ప్రదేశంలో బాలికలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 94 పాఠశాలల వాష్ సర్వే నివేదికను విడుదల చేశారు. నర్సింహారెడ్డి సర్వే వివరాలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికల విద్యా ప్రగతి కోసం పాఠశాలలో పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు మరుగుదొడ్లు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో యూనిసెఫ్ ఆఫీసర్ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.


