పేదల సొంతింటి కల సాకారం
గట్టు: పేదల సొంతింటి కల ప్రజాపాలనలో సీఎం రేవంత్‌రెడ్డి సహకారం చేసినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆరగిద్దలో గద్వాల నియోజక వర్గంలో నిర్మించిన తొలి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆరగిద్దకు చెందిన మాదిగుండులక్ష్మీ, కుమ్మరిసుజాత, మాలపార్వతమ్మలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, వారు నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ ముగ్గురు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే గృహ ప్రవేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అరగిద్దకు చెందిన లబ్దిదారులు పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. లబ్ధిదారులకు విడతల వారిగా రూ.5 లక్షలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, నియోజక వర్గానికి 3500 ఇండ్లు మంజూరు కాగా, 1500పైగానే నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల ఇప్పటికి నేరవేరినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు రమేష్‌నాయుడు, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


