దళారులను నమ్మి మోసపోవద్దు
ఎర్రవల్లి: రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం మండలంలోని బీచుపల్లిలో పుటాన్‌దొడ్డి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులతో పాటు టార్పాలిన్ కవర్లు, ఖాళీ సంచులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడూ సెంటర్ నుంచి తరలించి రైతు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, వెంటనే ఖాతా ద్వారా నగదును జమచేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, ఏఓ సురేష్‌గౌడ్, ఏఈఓ నరేష్, నాయకులు నారాయణ నాయుడు, హనుమంతురెడ్డి, రవీందర్‌రెడ్డి, ఈరన్న, సుదాకర్, రైతులు, తదితరులు ఉన్నారు.


