విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
గద్వాలటౌన్: విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు పట్టుదలతో శ్రమించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోటివేషన్ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మోటివేషన్ తరగతులు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పుస్తకాలలో నేర్చుకునే విషయాలను నిజజీవితంలో ప్రయోగించి, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానం ముఖ్యమన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సైకాలజిస్టు రాఘవేందర్ మాట్లాడుతూ పరీక్షలకు ఏ విధంగా సన్నద్దం కావాలనే దానిపై వివరించారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్దం కావాలని సూచించారు. సొంతంగా ఆలోచించడం, నిరంతర సాధన చేయడం విద్యార్థులు మరువరాదన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ప్రతినిధులు బీచుపల్లి, బాబునాయుడు, గోవర్థన్‌రెడ్డి, సవారన్న తదితరులు పాల్గొన్నారు.


