పెండింగ్ కేసులపై విచారణ చేపట్టాలి
గద్వాల క్రైం: పెండింగ్ కేసులపై వేగంగా విచారణ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 15 న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం ఉంటుందన్నారు. రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను ఇరువర్గాల అర్జీదారులతో మాట్లాడి కేసులను పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. వివిధ వివాదాలపై వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా స్టేషన్ పరిధిలో అవగాహన కల్పించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, వినియోగించుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.
వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి
అమ్మాయిలపై వేధింపులకు గురి చేసే వారిని అడ్డుకునేలా ప్రతి ఒక్కరూ ముందుకు కదలాల్సిన ఆవశక్యత ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సహజంగా మహిళలకు ధైర్యం లేదనే యోచనతో పోకిరీలు వెకిలి చేష్టలు చేస్తూ మానసికంగా వేధించడం, లైగింక దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, అమ్మాయిలు మానసికంగా అత్యంత బలవంతులమని సమాజానికి చూపాల్సిన అవసరం ఉందన్నారు. బాలికలు ప్రేమ పేరుతో మోసపోకుండా ఉన్నతంగా చదివి సొంత కాళ్లపై నిలబడాలని ఆకాంక్షించారు. ప్రతి మహిళలకు ఎల్లవేళలా జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. మహిళల సమస్యలకు భరోసా కేంద్రంలోని సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అత్యాచార బాధిత మహిళలకు అన్ని రకాల (మెడికల్, న్యాయసలహ, వైద్యం, కౌన్సెలింగ్, సైకాలజిస్ట్ సపోర్ట్) సేవలను అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 87126 70312 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ఆపద సమయంలో షీ టీం సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు.


