‘చదువుకునే అదృష్టాన్ని దూరం చేయొద్దు’
గట్టు: ‘మీరు చదువుకొని ఉండకపోవచ్చు, కానీ మీ పిల్లలకు చదువు అనే అదృష్టాన్ని దూరం చేయొద్దని, ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని’ జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా పర్యవేక్షణ అధికారుల బృందం డ్రాప్ అవుట్, రీ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా బల్గెర, మిట్టదొడ్డి, చాగదోన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ చదువు అనే ఆయుధాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు అందిస్తే, భవిష్యత్‌లో వారు మీ కష్టాన్ని శాశ్వతంగా దూరం చేస్తారని తెలిపారు. మధ్యలో బడి మానేసి, పంట పొలాల్లో పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. చిన్నారులను వయసుకు మించిన పనులకు తీసుకెళ్లి వారి బాల్యాన్ని నాశనం చేయొద్దని కోరారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలను పొలాల వైపు కాకుండా తరగతి గది వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, ఆయా పాఠశాలలకు చెందిన హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, సీపీఓ రవి, ప్ర భుత్వ అధికారుల బృందం సభ్యులు పాల్గొన్నారు.


