నేడు జిల్లాలో నీటి సరఫరా బంద్
గద్వాల: ధరూరు మండలం రేవులపల్లిలో నీటిశుద్ధి కర్మాగారాన్ని సోమవారం శుభ్రపర్చనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని మిషన్ భగీరథ గ్రిడ్ డీఈ రవిచంద్రకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కార్మిక హక్కుల
పరిరక్షణకు పోరాటం
అచ్చంపేట రూరల్: ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు సమస్యలకు నిలయంగా మారిందని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ అన్నారు. ఆదివారం అచ్చంపేటలోని టీఎన్‌జీఓ భవనంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమబోర్డులో సెస్ సక్రమంగా జమ కాకపోవడంతో కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదన్నారు. బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని, మెడికల్ చెకప్‌ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. సంక్షేమబోర్డును ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని.. రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పెర్ముల గోపాల్, మల్లేష్, కృష్ణ, చంద్రం, శివరాజు, రాములు, తిరుపతయ్య, సైదమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
పంటల సాగుపై
రైతులకు అవగాహన
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఆర్డీ ప్రసాద్ వానాకాలం పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఆముదం, వేరుశనగ సాగులో మెళకువలు, సాంకేతికత గురించి వివరించారు. కేవీకే మదనాపురం శాస్త్రవేత్త భవాని మాట్లాడుతూ.. వానాకాలంలో వరి, కంది సాగుకు అనుకూలమైనవని, రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కిసాన్ డ్రోన్లు, బయో ఎరువుల గురించి వివరించారు. ఏఈఓ కవిత మాట్లాడుతూ.. భూమి సారవంతంగా ఉండాలంటే రైతులు పచ్చిరొట్ట పైర్లు 40 రోజులు ముందుగా వేసుకొని పూత దశలో కలియదున్నాలని, దీంతో భూసారం దెబ్బ తినకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా వరి కొయ్య లను తగలబెట్టరాదని సూచించారు. మాజీ స ర్పంచ్ గోవర్ధన్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
నర్సింగాపురంలో..
మదనాపురం: మండలంలోని నర్సింగాపురంలో ప్రధాన పంటలైన వరి, పత్తి, వేరుశనగ, జీలుగ, కంది పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త అనిత సంతులిత, సేంద్రియ ఎరువుల వినియోగం, భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. విత్తన ఎంపికపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఓ గాయత్రి, మాజీ సర్పంచ్ హనుమాన్‌రావు, మైనుద్దీన్, కాశన్న, గట్టన్న పాల్గొన్నారు.
3 నుంచి ఇంటర్
ప్రయోగ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శనివారం వెల్లడించారు. జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ప్రయోగ పరీక్షలు కొనసాగుతాయన్నారు. 3న వృక్షశాస్త్రం, 4న జంతు శాస్త్రం, 4, 5 తేదీల్లో భౌతిక శాస్త్రం, 5, 6న రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయని వివరించారు. అదేమాదిరిగా జూన్ 9, 10న ఇంగ్లీష్, 11న పర్యావరణ విద్య పరీక్ష, 12న నైతికత, మానవ విలువలు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్లను కళాశాల నుంచి లేదా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని, సకాలంలో కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
నేడు జిల్లాలో నీటి సరఫరా బంద్


