డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి
ఎర్రవల్లి: రైతులు ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగించుకోవాలని, గ్రూపులుగా కలిసి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి లాభసాటిగా మార్చుకోవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మహ్మద్ అలీ అక్బర్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి ఆయిల్‌పాం నర్సరీలో వర్షాధార ప్రాంత అభివృద్ధిలో భాగంగా రైతులకు కూరగాయలు బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై కొండేరు, కుర్తి రాయలచెర్వు క్లస్టర్లకు చెందిన 110మంది రైతులకు రూ.11లక్షల విలువగల కూరగాయల బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వైవిద్యమైన పంటలు సాగుచేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంభించి మెరుగైన ఆదాయాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎండీడీకేవై పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా జిల్లాలో ఉద్యాన, పశు, మత్స్య, తదితర రంగాలకు చెందిన లబ్దిదారులు సైతం తమ వృత్తుల్లో గణనీయమైన అభివృద్ధిని సాదించేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అలంపూర్ డివిజన్ ఉద్యానశాఖ అధికారిణి ఇమ్రానా, సర్పంచులు ఈరన్న, మద్దిలేటి, నాయకులు సోమనాద్రి, వెంకటేష్, రాముడు, మద్దిలేటి పాల్గొన్నారు.


