క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
● విద్యుద్దీపాలతో చర్చిల అలంకరణ
● ముందస్తు సంబరాలు షురూ..
గద్వాలలో విద్యుద్దీపాలతో ముస్తాబైన ఎంబీ మిస్పా చర్చి
గద్వాలటౌన్: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని కరుణామయుడి కోవెలలు ముస్తాబు అయ్యాయి. గురువారం పండగకు మరి కొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటికే చర్చిలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. ముఖద్వారాలను అందంగా ఏర్పాటుచేశారు. చర్చిలు, ఇళ్లపై రంగురంగుల విద్యుద్దీపాలను ఉంచిన నక్షత్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎంబీ మిస్ఫా చర్చిలో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చిలలో ముందస్తుగా క్రిస్మస్ సంబురాలు మొదలయ్యాయి. క్రైస్తవులు పండగ నిమిత్తం కొత్త దుస్తులు, వస్తు సామగ్రి కొనుగోలు చేశారు. కొంతమంది ఇళ్లల్లో క్రిస్మస్ చెట్టును పెంచుకుంటుండగా మరికొందరు చెట్లను కొనుగోలు చేసి ఇంటి ఆవరణలో విద్యుద్దీపాల మధ్య అలంకరిస్తున్నారు.
కోలాహలంగా చర్చిలు..
జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో ఉన్న చర్చిల్లో ముందస్తుగానే ముస్తాబు చేపట్టడంతో పండగ వాతావరణం నెలకొంది. విద్య, ఉద్యోగ, కార్మిక, వ్యాపార రంగాల్లో ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు సైతం పండగకు సొంత గ్రామాలకు వచ్చారు. పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు వినియోగదారులకు పండగకు సంబంధించిన వస్తువులను అందుబాటులో పెట్టారు. అదే విధంగా క్రిస్టియన్ యువజన సంఘాల సభ్యులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో క్రిస్మస్ సంబురాలు జరుపుకొంటున్నారు. విద్యార్థులకు మిఠాయిలు, కేక్‌లు పంచిపెడుతూ ఆనందోత్సవాల మధ్య పండగకు సిద్ధమవుతున్నారు. చర్చిల ఆవరణలో ఏసుక్రీస్తు జననం, దేవుని జీవిత చరిత్ర, తదితర అంశాలను వివరిస్తున్నారు. ప్రతి సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండటంతో పలు చర్చిలు సందడిగా మారాయి.


