ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
● ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి
● కలెక్టర్ సంతోష్
గద్వాలన్యూటౌన్: బ్యాకింగ్ లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రజలందరికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు బుధవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ హల్‌లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదేళ్లు, ఆపైబడి వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ తదితర కంపెనీల్లో ఖాతాదారులకు సంబందించి క్లెయిమ్ చేయకుండా మిగిలిన డిపాజిట్లను తిరిగి పొందేందుకు, ఆయా ఖాతాలను మళ్లీ పునరుద్దరించుకోవడానికి ‘మీ డబ్బు మీ హక్కు’ సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జిల్లాలో సుమారు లక్షకు పైగా ఖాతాలకు చెందిన రూ. 16.39కోట్లు క్లైయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని, వీటిని తిరిగి చెల్లించేందుకు ఆర్‌బీఐ అధికారులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో సాధారణ ప్రజలతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదట బ్యాంకుల్లో అత్యధిక డిపాజిట్లు కల్గిన వెయ్యి మంది ఖాతాధారులను గుర్తించి, వారు తమ డబ్బులను క్లెయిమ్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. తర్వాత మిగతా ఖాతాదారులకు అవగాహన కలిగించి, తమ డిపాజిట్లను తిరిగే పొందేలా బ్యాకింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. వినియోగంలో లేని ఖాతాల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఉద్గం పోర్టల్ సహకరిస్తుందన్నారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలకు పాల్పడే వాళ్లు తాము బ్యాంకుల నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, వివిధ లింకులు పంపించి, ఖాతాలకు సంబందించిన వివరాలు అడుగుతూ ఓటీపీలు చెప్పాలని మోసం చేస్తుంటారని, ఏ బ్యాంకు అధికారులు కూడా ఇలా అడగరని, ప్రతి ఖాతాదారుడు తెలుసుకుంటే సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చునని చెప్పారు. బ్యాంకులకు సంబందించిన యాప్‌ల ద్వారానే నగదు బదిలీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈసందర్భంగా ఇటీవల క్లెయిమ్ చేసుకున్న పలువురు ఖాతాదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన కరదీపికలను కలెక్టర్ బ్యాంకింగ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ సుప్రభాత్, యూబీఐ జోనల్ హెడ్ అరవింద్ కుమార్, డీజీఎం సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం మనోహర్‌రెడ్డి, ఎల్‌డీఎం శ్రీనివాసరావ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, భీమా రంగ సిబ్బంది పాల్గొన్నారు.


