పకడ్బందీగా భూ భారతి సదస్సులు
గద్వాల: జిల్లాలో జూన్ 3 నుంచి 20 వరకు భూ భారతి సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అని, ఇందుకోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేస్తుందన్నారు. కొత్త చట్టం ద్వారా రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్‌ఓఆర్ మార్పులు– చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్‌సీలు వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. జిల్లాలోని ఇటిక్యాల మండలంలో భూ భారతి పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేశామన్నారు. అలాగే మంగళవారం నుంచి జరిగే రెవెన్యూ సదస్సులకు మండలం నుంచి రెండు బృందాలు ఏర్పాటు చేసుకుని రోజుకో గ్రామాన్ని సందర్శించి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
● రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రా జీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన, పారదర్శకంగా చేపట్టాలన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం మిల్లులకు తరలించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణ చివరి దశలో ఉందని ఇప్పటికే అనుకున్న లక్ష్యంలో 90 శాతం ధాన్యం సేకరించామని, మిగిలిన 10 శాతం వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్నీ బ్యాగులు, లారీల ట్రాన్స్‌పోర్ట్ వంటివి వేగవంతంగా చేపట్టాలన్నారు.


