లాటరీ విధానంలో ఎంపిక
గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మూడు స్వీపర్ పోస్టులను లాటరీ విధానంలో భర్తీ చేసినట్లు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు స్వీపర్ పోస్టులకు లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ పోస్టులకు మొత్తం 54 దరఖాస్తులు రాగా.. వారి సమక్షంలో లాటరీ విధానాన్ని చేపట్టారు. లాటరీ విధానంలో ఎస్సీ మహిళ యశోధ, జనరల్ పోస్టుకు మహిళ శివమ్మ, జనరల్ ఆల్ కెటగిరీలో ఎం లీలావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇంచార్జీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప, ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఆర్టికల్ 371జే
అమలు చేయాలి
గద్వాల: అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిన నడిగడ్డ ప్రాంతంలో ఆర్టికల్ 371జే అమలు చేసి అభివృద్ధి చేయాలని సీనియర్ సిటిజన్ ఫోరం కన్వీనర్ మోహన్‌రావు కోరారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు డాక్టర్ చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నివేదిక అందజేయండి
వనపర్తి: జిల్లాలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల కేటాయింపుపై సమర్థన నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సువర్ణ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 41వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇందులో 12 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 7.166 హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు పటం ద్వారా తెలుస్తోందన్నారు. అటవీ భూమి కేటాయిస్తే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. స్పందించిన డా. సువర్ణ 7.166 హెక్టార్ల స్థలం దేని కొరకు కావాలో సమర్థన నివేదిక అందజేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించారు. వీసీలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
నేతన్నలను
ఆదుకుంటాం
అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్‌రెడ్డి, ఆర్‌డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
లాటరీ విధానంలో ఎంపిక


