రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చే
● బీఆర్‌ఎస్ హయాంలో ఆగిన వలసలు మళ్లీ మొదలయ్యాయి
● పాలమూరు ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
● సర్పంచ్‌ల సన్మాన సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబంధుల పాలన వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి పాలమూరులో ఆగిన వలసలు తిరిగి మొదలయ్యాయన్నారు. ఈ ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఎప్పుడూ పండబెట్టి తొక్కుతా అంటూ మాట్లాడే రేవంత్‌రెడ్డి.. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని.. ఆయన చేపట్టే పోరాటానికి పాలమూరు బిడ్డలు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. రెతులు యూరియా బస్తాల కోసం గోస పడుతున్నారని కేటీఆర్ అన్నారు. చలిలో చెప్పులు క్యూలో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్‌రెడ్డికి రైతులపై ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబితే రేవంత్‌కు సోయి వచ్చిందన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని.. జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని పేర్కొన్నారు.


