ఒకటే పార్టీ.. రెండు కార్యక్రమాలు
● గద్వాల కాంగ్రెస్‌లో అదే తీరు
● మరోసారి వర్గ రాజకీయాలకు వేదికగా మారిన పార్టీ ఆవిర్భావం
గద్వాలటౌన్: గద్వాల కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింటి పేరని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. కానీ కార్యక్రమాలు మాత్రం రెండు చోట్ల పోటాపోటీగా జరిగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు గ్రూపు రాజకీయాలకు మరోసారి వేదికయ్యాయి. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా.. తాజాగా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి నియామకంతో మరో శిబిరం ఏర్పడింది. రాజీవ్‌రెడ్డికి ఎమ్మెల్యే వర్గీయులు మద్దతుగా ఉండటంతో సరిత వర్గీయులు గుర్రుగా ఉన్నారు. మొదటి నుంచి రాజీవ్‌రెడ్డి కార్యక్రమాలకు సరిత వర్గీయులు దూరంగా ఉన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదు :డీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటు తప్పదని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి హెచ్చరించారు. డీసీసీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పార్టీ నిబంధనల ప్రకారమే పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక్కటే ఉందని, అది డీసీసీ కార్యాలయమే అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసి, కార్యక్రమాలు నడిపితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ బీ–ఫామ్ టిక్కెట్లు ఇచ్చేది నేనేనని చెప్పారు. జనవరి 5 నుంచి గ్రామాలలో పర్యటన చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వర్గీయులు, తదితరులు పాల్గొన్నారు.


