నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అయిజ: మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హెచ్చరించారు. శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తైబజార్ వేలం నిర్వహణ నిబంధనల మేరకు లేకపోవడంతో దాన్ని రద్దుచేసి కొత్తగా వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వార్డు ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ వారి వార్డుల్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఎప్పడు అడిగినాసరే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్నారు. మృతిచెందిన వారికి అనేక నెలలుగా పించన్లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని, వారి వివరాలు సేకరించి రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి భూగ్భ జలాలను పెంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరలో విడుదల అవుతుందని, అనర్హులను గుర్తించి వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ నిరంతర ప్రక్రియ అని, కమర్షియల్ టాక్స్ చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మండలంలోని ఉప్పల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నాణ్యత, గోడౌన్ సదుపాయాలు, రైతులకు జారీచేసే రసీదులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పొరపాట్లకు తావు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
మల్దకల్: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హెచ్చరించారు. మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయగా.. కొందరు విధులకు హాజరుకాలేదు. సమయపాలన పాటించి ప్రతి ఒక్కరు విధులకు సక్రమంగా హాజరుకావాలని ఆదేశించారు. నర్సరీలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచి సంరక్షించాలని అన్నారు.


