సామాజిక రుగ్మతలు రూపుమాపాలి
గద్వాల: సమాజాన్ని పట్టిపీడిస్తున్న బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు వంటి రుగ్మతలు తొలగిపోయేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం దేశతొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఐడీవోసీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల పురస్కారాలు అందించారు. అంతకు ముందు ఆయన సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో నేటికి మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 19వ శతాబ్దంలో మన దేశంలో మహిళలకు చదువు నేర్పించేందుకు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మహాత్మా జ్యోతిరావుపూలే విశేష కృషి చేయగా ఆయన సహకారంతో సావిత్రి బాయిపూలే 1848లో పూణేలో మహిళలకు మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి విద్యాబోధన చేశారన్నారని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో మహిళా ఉపాధ్యాయులు పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా విద్యార్థులకు సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన కల్పించాలన్నారు. మన జిల్లాలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో నేటికి బాల్యవివాహాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని పూర్తిగా రూపుమాపేందుకు ఉపాధ్యాయులు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. బాలికలు పదో తరగతి, ఇంటర్‌తోనే చదువును మధ్యలో ఆపేస్తున్నారని అలా కాకుండా ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించేలా ప్రోత్సహించాలన్నారు. దేశంలో 50శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయురాలు ఉండడం మనకెంతో గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో దేశాభివృద్ధికి కృషి చేసే భావి భారత పౌరులైన నేటిబాలలను ఉత్తములుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


