గద్వాల: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. ప్రజాసంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అమలు చేసేలా ఎక్కడా, ఎలాంటి వైరుధ్యాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో మహిళలు అధిక సంఖ్యలో సర్పంచులు, కౌన్సిలర్లుగా గెలుపొందడం శుభపరిణామమన్నారు. 99 రోజులపాటు పది అంశాలతో చేపడుతున్న కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 2న గ్రామ, వార్డుసభలు నిర్వహించి ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు కీలకంగా ఉండేందుకు గాను ఒకరోజు శిక్షణ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సందేహాలు ఉంటే మాస్టర్ ట్రైనర్లు నివృత్తి చేస్తారని చెప్పారు.
సామాజిక సమస్యలను రూపుమాపాలి
జిల్లాలో అధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయని, అలాగే పలు సామాజిక సమస్యలు నెలకొన్నాయని, వాటిని రూపుమాపేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసుకుని మరమ్మతు చేయించడం జరిగిందన్నారు. నూనతంగా ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాఠశాలల పనితీరు మెరుగుపర్చేలా తరచూ పర్యవేక్షణ చేయాలన్నారు. బాలికలు చదువులు మధ్యలోనే ఆపేయకుండా ఉన్నత విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సాహం అందించాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉందని త్వరలో మరోసారి జనాభా గణన చేపడుతున్నందున అక్షరాస్యత శాతం పెంచేలా కృషిచేయాలన్నారు. పిల్లల్లో న్యూట్రిషన్ సమస్యల నివారణకు అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. పోలీసుశాఖ డ్రగ్స్, రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు.
కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్


