పాలమూరు: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం స్థానికంగా కన్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు నెలకొనడంతో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వాణిజ్య సిలిండర్ల పంపిణీలో కోతలు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్, టిఫిన్ సెంటర్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. ఇలాగైతే హోటళ్లను మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో కోత పెట్టడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఏజెన్సీలు నిలిపేయడం, ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. రెట్టింపు మొత్తం ఇస్తామన్నా సిలిండర్ దొరకడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో రోజుకు 2 వేల సిలిండర్లు
ఉమ్మడి పాలమూరులో మహబూబ్‌నగర్ జిల్లాలో 25 ఏజెన్సీల పరిధిలో 3,01,395 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఉజ్వల 40,199, దీపం 44,445 కనెక్షన్లు ఉన్నాయి. డొమెస్టిక్, కమర్షియల్ 2,16,651 కనెక్షన్లు ఉన్నాయి. కాగా.. మహబూబ్‌నగర్ నగరంలో రోజుకు 2 వేల కమర్షియల్ సిలిండర్ల వినియోగం ఉంటుందని సమాచారం. జోగుళాంబ గద్వాల జిల్లాలో 11 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. 1,99,150 డొమెస్టిక్ కనెక్షన్లు, 850 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 9 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. 139,838 డొమెస్టిక్, 657 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో పెద్దపెద్ద హోటళ్లు, మెస్‌లు దాదాపు 350 వరకు ఉండగా... చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీపాయింట్లు సుమారు నాలుగు వేల వరకు ఉంటాయని అంచనా. వీటన్నింటిలో కమర్షియల్ సిలిండర్లనే వాడుతున్నారు.
● ప్రస్తుతం అన్ని రకాల హోటల్స్, రెస్టారెంట్‌లకు గ్యాస్ ఇవ్వడం నిలిపివేశారు. పొయ్యిలు మండించి బట్టీలు నిర్వహించే హోటళ్లకు ఇబ్బంది లేకున్నా.. గ్యాస్ మీదే ఆధారపడి వారు పూర్తిగా సందిగ్ధంలో పడ్డారు. దీంతో గృహావసరాలకు వాడాల్సిన సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. రెండు రోజులుగా కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోయింది. దీంతో హోటళ్లు, రోడ్లపై ఉండే టిఫిన్ సెంటర్లు, మిర్చి బండిలు, ఇతర తినుబండరాల దుకాణాల్లో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నారు.


