ఇన్‌స్ట్రాగాంలో వచ్చి.. వాట్సప్‌లో మెరిసి
కల్వకుర్తి రూరల్: ఒకానొక సందర్భంలో కల్వకుర్తి పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించిన సుభాష్‌నగర్‌లోని గచ్చుబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ఈ బావి దుస్థితిని పట్టణానికి చెందిన యువకుడు కల్వ కార్తీక్ ‘కల్వకుర్తి డైరీ ఇన్‌స్ట్రాగాం’ పేజీలో కళ్లకు కట్టినట్లు వీడియో తీసి పోస్టు చేయడంతో పెద్దఎత్తున స్పందన లభించింది. వందలాది మంది యువకులు ముందుకు వచ్చి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ‘సేవ్ గచ్చుబావి కమిటీ’ పేరిట చైతన్యం చేశారు. దీంతో గత 52 రోజులుగా శివాలయం మెట్ల బావి మరమ్మతు చేపట్టారు. మేముసైతం అంటూ మహిళలు శ్రమదానంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. అయితే బావి లోతు తీయడానికి ఇబ్బందిగా మారడంతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం మరమ్మతుకు నిధులు మంజూరు చేయించి పెద్ద క్రేన్ ఏర్పాటు చేయించారు. దీంతో వేగంగా పనులు పూర్తి కావొస్తున్నాయి. శివరాత్రి నాటికి శివాలయం, గచ్చు బావికి పూర్వవైభవం తీసుకువచ్చేలా కృషిచేస్తున్నారు. శివాలయంలోని శివలింగానికి బావినీటితో అభిషేకం చేసేందుకు సేవ్ గచ్చుబావి కమిటీ సభ్యులు సంసిద్ధులు అవుతున్నారు. సేవ్ గచ్చుబావి పేరుతో మొదలుపెట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో యువకుల శ్రమ ఫలించనుంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన చైతన్యం కూడా గచ్చుబావి పూర్వవైభవానికి ఒక మెట్టులా ఉపయోగపడింది అనేది అక్షర సత్యం.


